Saturday, 22 October 2016

చారిత్రక ఖిల్లా..రామగిరి ఖిల్లా

ఆంధ్రుల అతి ప్రాచీన దుర్గాల్లో ఒకటైన ధూళికట్ట(ధూళికోట) ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఉంది. కోటకు సమీపంలోని బౌద్ధస్తూపం క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందినదికాగా, అమరావతి స్తూపం(క్రీ.శ.1వ శతాబ్దం) కంటే అతి ప్రాచీనమైంది. ధూళికట్టలోని తొలి చారిత్రక యుగపు దిబ్బ 18 హెక్టార్ల స్థలంలో విస్తరించి ఉండగా, పురావస్తు తవ్వకాల్లో రాజభవనాలు, ధాన్యాగారాలు, ఇతర నిర్మాణాలు, బావులు, అనేక పంచ్‌మార్క్‌డ్ నాణేలు, బాణపు మొనలు, బల్లెపు మొనలు, మృణ్మయ పాత్రలు, రాగి, ఇనుప, దంతపు, టెర్రకొట్ట వస్తువులు, పూసలు బయటపడ్డాయి. హుస్సేనిమియా వాగు తీరంలోని హీనాయాన శాఖకు చెందిన బౌద్ధస్తూపం దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైంది.

చరిత్ర చెక్కిన రామగిరి..
కమాన్‌పూర్ మండలంలోని బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల నడుమ విస్తరించిన రామగిరి ఖిల్లా సుప్రసిద్ధ గిరిదుర్గం. శత్రుదుర్భేద్యమైన ఈ కోట, అరుదైన శిల్పకళ, ప్రకృతి సోయగాలకు నెలవు.

విశేష వనమూలికలు, అపార వృక్ష సంపదకు నిలయం. మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న రామగిరి ఖిల్లా, పటిష్ఠమైన రాతి కట్టడం. కో టగోడలు, బురుజులు, భవనాలు, సమాధులు, మసీదులు, బావులు, కొలనులతో నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. దుర్గాంతర్భాగంలో కాకతీయ ప్రతాపరుద్రుడి ఆధ్వర్యంలో నిర్మించిన కోట, అశ్వశాల, దర్బారు, చెరసాల, గజశాల, భోజనశాలలు, రహస్యమార్గాలు, సొరంగాలు, తోపులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.

శాతవాహనుల తొలిరాజధాని కోటిలింగాల, మరో నగరం ధూళికట్ట(ఈ రెండూ కరీంనగర్ జిల్లాలోని శాతవాహనుల స్థావరాలు)కు అత్యంత సమీపంలో ఉండడం వల్ల క్రీ.పూ.2వ శతాబ్దం నాటికే రామగిరి, శాతవాహనుల రహస్య స్థావరంగా ఉండి ఉంటుందని తెలంగాణ చరిత్రకారులు భావిస్తున్నారు. అప్పటి నుంచి వివిధ రాజవంశాలకు చెందిన రాజులు ఎవరికి తోచిన రీతిలో వారు కొండపై నిర్మాణాలు చేపడుతూ వచ్చారు.

కళ్యాణి చాళుక్యుల కాలంలో (క్రీ.శ.973- క్రీ.శ.1189) ఓరుగల్లు కాకతీయ రెండో ప్రోలరాజు.. క్రీ.శ.1138లో మంథని గుండరాజు, రామగుండం ఏడ రాజుపై దండెత్తగా, వారిద్దరూ రామగిరి దుర్గాన్ని రక్షణగా చే సుకుని యుద్ధం చేశారు. వీరిద్దరూ పరాజయంపాలవడంతో రామగిరి కాకతీయుల వశమైంది. అనంతర కాలంలో రేచర్ల పద్మనాయక రాజు అనపోతనాయకుడు దీనిని ఆక్రమించి, ముప్పభూపాలుడు అనే సామంతుడిని తన ప్రతినిధిగా నిలిపాడు.

ఇతడు రామగిరి కేంద్రంగా రాజ్యపరిపాలన చేశాడు. క్రీ.శ. 1433లో బహమనీ సుల్తాన్ మొదటి అహ్మద్‌షా తెలంగాణపై దండెత్తడంతో రామగిరి దుర్గం అతని వశమైంది. కుతుబ్‌షాహీ వంశస్థాపకుడైన కులీకుతుబుల్ ముల్క్(1518-1543), బహమనీల ప్రతినిధి ఖివాము ల్ ముల్క్‌ను ఓడించి, రామగిరిని వశపరుచుకున్నాడు. క్రీ.శ.1656లో గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా ఔరంగజే బు రాజప్రతినిధి చేతిలో ఓడిపోయి, తన కుమార్తెను ఔరంగజేబు కొడుకుకు ఇచ్చి, కట్నం కింద రామగిరి కోటను అప్పగించాడు.

ఎన్నెన్నో విశేషాలు..
ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి దేవాలయం, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల నడుమ నిమ్మనపల్లి లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవాలయం, ధర్మారం మండలం బొట్లవనపర్తిలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, వేదపురిగా గుర్తింపు పొందిన మంథనిలోని గౌతమేశ్వరాలయం సహా అనేక ప్రాచీన దేవాలయాలు, పెద్దబొంకూర్‌లోని శాతవాహనుల గ్రామం, కదంబాపూర్‌లోని బృహత్‌శిలా సమాధులు జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక రామగుండంలోని రామునిగుండాలు, బ సంత్‌నగర్ సమీపంలో బుగ్గ, పెద్దపల్లి మండలం సబ్బితంలోని గౌరి గుండాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

0 comments:

Post a Comment