Saturday, 22 October 2016

ఆటోవాలాలు బాధ్యతాయుతంగా మెలగాలి

-రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్
ఆటో డ్రైవర్లు ప్రయాణికుల విషయంలో మర్యాదగా, బాధ్యతాయుతంగా మెలగాలని రామగుండం నగర పోలీస్ కమిషనర్ విక్రం జిత్ దుగ్గల్ సూచించారు. మీ కోసం జనమైత్రి పోలీసు కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆటో డ్రైవర్లు, యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గల్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు, యజమానులు బాధ్యతా యుతంగా మెలిగితే ఎలాంటి పోలీసుల వేధింపులుండవన్నారు. ఆటోవాలాలు లైసెన్సు, జీవిత బీమా, రిజిస్ట్రేషన్, అన్ని ధ్రువీకరణ ప్రతాలు కలిగి ఉంటే వారితోపాటు ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులకు సైతం మంచిదన్నారు.

ఆటో డ్రైవర్లు ఇప్పటి నుంచి గుర్తింపు కార్డు, డ్రైవర్ సీట్ వెనుక ఆటో డ్రైవర్ యజమాని పేరు, చిరునామా, మోబైల్ నంబరు విధిగా ఏర్పాటు చేసుకోవాలనీ, ఆటో వివరాలను ఆధార్ కార్డు కలిపి ట్రాఫిక్ ఠాణాలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనీ, అన్ని కాగితాలున్న వాహనాలకు రెడ్ స్టిక్కర్లు అంటిస్తామని ఇలాంటి వాటిని మాటిమాటికి ఆపమన్నారు. ఆటోలో అసాంఘీక కార్యకలాపాలు, గుట్కా, రేషన్ బియ్యం, ఇతరత్రా అక్రమాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని ఆటో డ్రైవర్లకు, యజమానులకు ఆర్‌ఎస్ సొల్యుషన్స్ సంస్థ ద్వారా రూ.100 చెల్లిస్తే ప్రమాద బీమా రూ. 2 లక్షలు ఇప్పించేలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి జోన్ డీసీపీ విజయేందర్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి, ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు గోపు ఐలయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐలు లక్ష్మయ్య, రాంమ్మూర్తి, మస్తాన్, 1100 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు


0 comments:

Post a Comment